BREAKING NEWS:మర్కజ్‌కు వెళ్లిన 400 మందికి కరోనా పాజిటివ్ : కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటి వరకూ 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. నిజాముద్దీన్ జమాతే వల్లే 400 పాజిటివ్ కేసులు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతిరోజూ ప్రెస్ మీట్‌లో భాగంగా ఆయన గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన తొమ్మిది వేల మందిని తాము గుర్తించామని, వారందర్నీ క్వారంటైన్‌కు తరలించినట్లు ఆయన ప్రకటించారు.

1300 మంది విదేశీయులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారని అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే కరోనా సోకిన 400 మందితో 1950 మందికి లింక్ ఉందని ఆయన చెప్పారు. గడచిన 24 గంటల్లో 324 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో 12 మంది చనిపోయినట్లు ఆయన ధృవీకరించారు. ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలని, లాక్‌డౌన్ నిబంధనలను కూడా కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్వారంటైన్ లో ఉన్నవారందరూ అలాగే ఉండాలని, క్వారంటైన్ అనేది ఓ తపస్సు లాంటిదని లవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. 

Comments