పేదలకు 5 వేలివ్వండి

2 నెలలకు సరిపడా రేషన్‌ కూడా..
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడకూడదు
రైతుబజార్లలో చౌకగా కూరగాయలు
యుద్ధప్రాతిపదికన ప్రజారోగ్య చర్యలు
ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ
అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి రూ.5 వేల నగదు, రెండునెలలకు సరిపడా రేషన్‌ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు సోమవారం లేఖ రాశారు. ‘కరోనా తీవ్రతతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయి. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్‌-19వైరస్‌ ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌ చేయడం, విడిగా ఉంచడం, స్థానికంగా ఈ వైరస్‌ ఎవరికీ సోకకుండా నిరోధించడంపైనే ప్రభుత్వాలు పెద్దఎత్తున దృష్టిపెట్టాల్సి ఉంది. కేవలం లాక్‌డౌన్‌ చేయడంతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని, పెద్దఎత్తున ప్రజారోగ్య చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సమాఖ్య ఇప్పటికే సూచించింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలో కూడా కరోనా నిరోధక చర్యలు త్వరితగతిన చేపట్టాలి’ అని సూచించారు. ‘విదేశాల నుంచి దాదాపు 15వేల మంది రాష్ట్రానికి చేరినట్లు తెలుస్తోంది. వాళ్లందరికీ క్వారంటైన్‌ చేయాలి. పకడ్బందీగా వారందరినీ విడిగా ఉంచాలి. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యం-పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. లాక్‌డౌన్‌ వల్ల లక్షలాది పేద కుటుంబాల ఉపాధికి గండిపడింది.

ఇంట్లోనుంచి బయటకు రాకపోవడం వల్ల అటు ఉపాధి కోల్పోయి, ఇటు రోజువారీ ఆదాయం లేక రెండువిధాలా నష్టపోయారు. విపత్తులు సంభవించినప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి రెండు నెలలకు సరిపడా రేషన్‌ (బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు) ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు నగదు తక్షణమే ఏమాత్రం జాప్యం చేయకుండా అందించాలి. ఈ విపత్కర సమయంలో పేదలను ఆదుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు పెరిగిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే కూరగాయల ధరలు 300 శాతం పెరిగినట్లుగా మీడియాలో చూస్తున్నామని.. రైతుబజార్లలో చౌకధరలకే అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

Comments