నల్గొండ జిల్లాలో స్కూల్ టీచర్‌కు కరోనా పాజిటివ్... ఆందోళనలో విద్యార్ధుల తల్లిదండ్రులు

నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విశ్వరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కూడా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా వ్యాపిస్తోంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం మండ్రలో హైస్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ స్కూల్‌లో విధులు నిర్వహించిన టీచర్‌కు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. టీచర్‌కు కరోనా రావడంతో ముందస్తుగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపాద్యాయుడికి కరోనా తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పటికే నల్గొండ జిల్లాలో మొత్తం కరోనా కేసులు 9కి పెరిగాయి. మయన్మార్‌కు చెందిన 17 మంది నార్కట్‌పల్లి మసీదులో ప్రార్థనలు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్‌ తేలింది. దామరచర్ల మహిళ కూడా ఢిల్లీకి వెళ్లివచ్చి పాజిటివ్‌ అయ్యారు. 

మరోవైపు ప్రతి గంటకు కరోనా కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్య శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం నమోదైన 75 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరింది. నాలుగు రోజుల వ్యవధిలోనే 147 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం కరోనాతో ఇద్దరు చనిపోయారు. ఒకరు  రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌ గ్రామానికి చెందిన మహిళ(55) కాగా మరొకరు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది.

Comments