పొడి దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం.. ఇవీ కరోనా వైరస్ బారినపడిన వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలేవీ కనిపించకపోయినా వైరస్ బారినపడేందుకు అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. కానీ, జిల్లాలో కొత్తగా నమోదైన 5 పాజిటివ్ కేసులను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే మంగళ, బుధవారాల్లో వైరస్ బారినపడినట్టు తేలిన ఐదుగురిలో నలుగురికి ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. ఇది వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకు వైద్యులు కూడా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేశారు. లక్షణాలు లేని వ్యక్తులను కొద్ది రోజులపాటు పరిశీలనలో ఉంచి డిశ్చార్జి చేస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన మత సమావేశంలో పాల్గొని నగరానికి వచ్చిన 35 మందిని వైద్యులు 3 రోజుల కిందట ఆసుపత్రికి తరలించి నమూనాలు సేకరించారు. అయితే, వీరంతా ఢిల్లీ నుంచి వచ్చి 10 రోజులు దాటుతుండడం, ఎవరిలోనూ వైరస్ సోకిన లక్షణాలు కనిపించక పోవడంతో పాజిటివ్ కేసులు ఉండవని భావించారు. వీరిలో మంగళవారం రాత్రి కొందరివి, బుధవారం ఉదయం మరికొందరివి రిపోర్ట్సు వచ్చాయి. వీటిలో ఐదుగురు వైరస్ బారినపడినట్టు తేలింది. ఐదుగురిలో ఒక వృద్ధుడు(70) మాత్రమే ఒళ్లు నొప్పులతో బాధపడుతుండగా, మిగిలిన నలుగురిలో ఎలాంటి లక్షణాలు లేకపోగా ఆరోగ్యంగా కనిపించారు. అయినా, వైరస్ బారినపడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై వైద్యాధికారులను ఆరా తీయగా కొంతమందిలో వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు.
Comments
Post a Comment