నేటి నుంచి పెంచిన చార్జీల అమలు- కరెంటు షాక్‌...కరొన వేల !



నేటి  నుంచి పెంచిన చార్జీల అమలు
500 యూనిట్లు దాటితే యూనిట్‌ రేటు రూ.9.95
గతం కంటే 90 పైసలు పెరుగుదల
జిల్లాలో 4,474 మందిపై ప్రభావం
ఏసీ వినియోగిస్తే అంతే సంగతులు
రైల్వే, ఎత్తిపోతలు, సీపీడబ్ల్యుఎస్‌, ప్రభుత్వ కార్యాలయాలపైనా భారం

తూర్పు గోదావరి(NEWS BUJJ): కరోనా లాక్‌డౌన్‌ వల్ల ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. విద్యుత్‌ లేకుండా ఇంటి అవసరాలు గడవని రోజులివి. టీవీ, ఫ్యాన్‌. ఏసీ, ఫ్రిజ్‌, మిక్సీ ఇలా అన్నీ విద్యుత్‌తోనే నడుస్తున్నాయి. వాటికి తోడు ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం అంతరాయం లేకుండా విద్యుత్‌  సరఫరా చేయడంతో జనం ఇళ్లలో ఉండగలుగుతున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇల్లు వదలి రావడంలేదు. మార్కెట్‌ అవసరాలు తీరిన తర్వాత మిగతావారంతా ఇళ్లలోనే మకాం. దీంతో గృహ విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. ఈనెలలోనే బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉంది.

కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో పెంచిన విద్యుత్‌ చార్జీలు బుధవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ బిల్లులు పేలిపోయే అవకాశం ఉందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఓపక్క విద్యుత్‌ వాడకం పెరగడం, మరోపక్క బయటకు వెళ్లకపోవడం వల్ల పైసా ఆదాయం లేని సమయంలో కరెంటు బిల్లులు మరింత షాక్‌కు గురిచేయనున్నారు. జిల్లాలో 14,93,516 మంది గృహ విద్యుత్‌ వినియోగదారులుండగా 4,474 మంది మాత్రమే 500కంటే ఎక్కువ యూనిట్లు వినియోగిస్తున్నారని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.

కానీ ఇప్పటి పరిస్థితుల్లో వీరి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. అంతేకాక 500 యూనిట్లు తరువాత ఎన్ని యూనిట్లు వినియోగిస్తే అన్ని యూనిట్లకే పెంచిన ధర వర్తిస్తుందని చెబుతున్నారు. అలాగైతే కొంత ఊరటే. 500 యూనిట్లు దాటిన వినియోగదారుడి నుంచి ఇప్పటివరకు యూనిట్‌కు రూ.9.05 చార్జి చేసేవారు. ఇప్పటినుంచి మరో 90 పైసలు పెరుగుతుంది. అంతకంటే తక్కువ గృహ వినియోగదారులపై చార్జీలు మారలేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండడం వల్ల  విద్యుత్‌ చార్జీల ప్రభావం కచ్చితంగా గృహ వినియోగదారులపై పడుతుంది. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. దాంతో వచ్చే నెల బిల్లు కూడా మోతమోగనుంది.

ప్రభుత్వ సంస్థలపైనా బాదుడే..
ఎత్తిపోతల పథకాలు, రైల్వే, సీపీడబ్యుఎస్‌ స్కీమ్‌లు, ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ వినియోగ చార్జీలు భారీగా పెరిగాయి. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు కార్పొరేషన్లను ఈసారి ఒకే కేటగిరిలోకి తెచ్చారు. గతంలో వాటర్‌ వర్క్స్‌కి సంబంధించి గ్రామ పంచాయతీలకు యూనిట్‌కు రూ.4.85, మునిసిపాలిటీల్లో రూ.5.95, కార్పొరేషన్‌లో రూ.6.55 వసూలు చేసేవారు. వీధి దీపాలకు సంబంధించి పంచాయతీల్లో రూ.5.95, మునిసిపాలిటీల్లో 6.55, కార్పొరేషన్‌లో 7.05 వసూలు చేసేవారు. ఇప్పుడు వీటన్నింటిని ఒకే కేటగిరిలోకి తీసుకువచ్చారు. అందులో ఎన్టీఆర్‌ సుజల స్రవంతిని కూడా కలిపారు. వీటన్నింటికి ఇక యూనిట్‌కి రూ.7 వసూలు చేస్తారు. ఈ తరహా వినియోగదారులు ఎక్కువ మందే ఉన్నారు. ఇక రైల్వే స్టేషన్లలో విద్యుత్‌ వినియోగం చాలా భారమైంది. ఇప్పటివరకు యూనిట్‌కు రూ.3.75 వసూలు చేస్తుండగా, కొత్త చార్జీల ప్రకారం రూ.5.55 వసూలు చేస్తారు. ఏకంగా 1.75 పెంచేశారు.

అందుబాటులో లేని చార్జీల వివరాలు
విద్యుత్‌ ధరల వివరాలను ప్రాంతీయ భాషలో చిన్న పుస్తకాలుగా ప్రచురించి ఆఫీసుల్లో అందుబాటులో ఉంచాలని, ఇది వినియోగదారులకు తెలిసేలా ప్రచారం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌నియంత్రణ మండలి ఆదేశించింది. కానీ లాక్‌డౌన్‌తో ఇటువంటి ఏర్పాట్లు ఏమీ జరగలేదు. పరిశ్రమలకు, రైస్‌మిల్లులకు కూడా షాక్‌ తప్పలేదు. ఈ కష్ట సమయంలో చార్జీల పెంపును విరమించుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు

Comments