గుర్తుందిగా .. నేటి రాత్రి 9 గంటలకు lights ఆఫ్ చేసి ఏమి చేయాలో!

పోరాట స్పూర్తిని చూపిద్దాం:సినీతారాలు 

 

హైదరాబాద్‌: ‘గుర్తుందిగా.. నేటి రాత్రి 9 గంటలకు’ అని అంటున్నారు టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున. కరోనా వైరస్‌పై దేశ ప్రజలందరం కలిసి మరోసారి మన పోరాట స్ఫూర్తిని చూపిద్దామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా నేటి రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లను ఆఫ్‌ చేసి దీపాలు, కొవ్వొత్తులు లేదా మొబైల్‌ ఫ్లాష్‌లైట్స్‌ను వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పిలుపునకు ఇప్పటికే చిరంజీవి, రామ్‌చరణ్‌ మద్దతు తెలపగా తాజాగా నాగార్జున, సాయిధరమ్‌ తేజ్‌తోపాటు మలయాళి నటుడు మమ్ముట్టి సైతం ప్రధాని పిలుపును స్వాగతించారు. ఈ మేరకు ఆయా హీరోలు తమ సోషల్‌మీడియా అధికారిక ఖాతాల వేదికగా అభిమానులతో ప్రత్యేక వీడియోలను పంచుకున్నారు. ‘ఏప్రిల్‌ 5 ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రజలందరినీ దీపాలు వెలిగించి.. కరోనా చీకటిని పారద్రోలమని మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ రోజున మనందరం చూపించిన సంఘీభావాన్ని మరోసారి చూపిద్దాం. దేశమంతా ఒక్కటేనని.. ఐకమత్యంతో కరోనాపై మనం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని తెలియచేద్దాం. గుర్తుందిగా.. ఐదో తారీఖు.. రాత్రి తొమ్మిది గంటలకు.. దీపాలైనా, మొబైల్‌ ఫ్లాష్‌ లైట్స్‌ అయినా తొమ్మిది నిమిషాల పాటు వెలిగిద్దాం. మన పోరాట స్ఫూర్తిని మరోసారి చూపిద్దాం.’ అని నాగార్జున పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మలయాళి అగ్రకథానాయకుడు మమ్ముట్టి సైతం ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులను సృష్టంచింది.. దాని కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన విధంగా నేటి రాత్రి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోని లైట్లను ఆర్పివేసి దీపాలను వెలిగించాలని కోరుతున్నాను’ అని అన్నారు.

Comments