కలియుగ బ్రమ్మ వర్మ ! 2018లో వర్మ చెప్పిన ‘వైరస్’ స్టోరీకి దగ్గరగా ‘కరోనా’

జీవి పుట్టుక అంతా బ్రహ్మ చేతిలో ఉంటుందంటారు. నుదిటిరాత విషయంలో ఎక్కువగా ‘బ్రహ్మదేవుడు’ని తలుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు సినిమా విషయంలో అందరూ వర్మని సినిమా ‘బ్రహ్మ’గా వర్ణించడం మొదలెట్టారు. అదెలా అనుకుంటున్నారా? ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ వైరస్ గురించి అందరికీ తెలిసి 2 లేదా 3 నెలలు మాత్రమే అవుతుంది. కానీ సంచలన దర్శకుడు వర్మకు మాత్రం 2018లోనే తెలిసిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ.. 2018లో వర్మ ప్రకటించిన ‘వైరస్’ చిత్ర కథకి దగ్గరగా.. కాదు కాదు సేమ్ టు సేమ్ ఉండటం విశేషం. 2018లో వర్మ ‘వైరస్’ అనే పేరుతో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ‘సర్కార్’, ‘26/11 ది ఎటాక్’ చిత్రాల నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ సినిమాను నిర్మిస్తున్నార‌ని, పూర్తి వివ‌రాల కోసం ఫేస్‌బుక్ లింక్‌ని క్లిక్ చేయండని 10/6/2018న వర్మ ఓ ట్వీట్ చేశాడు. అదే ట్వీట్‌ను మళ్లీ వర్మ ఇప్పుడు ట్వీట్ చేసి.. రెండు సంవత్సరాల క్రితం నేను ప్రకటించిన ‘వైరస్’ చిత్రానికి, ప్రస్తుతం వణికిస్తున్న వైరస్‌కు ఎన్నో పోలికలు ఉన్నాయి. కావాలంటే చూడండి.. అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇక వర్మ ‘వైరస్’ కథ విషయానికి వస్తే.. ‘‘ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడి నుంచి ఓ వైరస్‌ను అంటించుకుని ముంబై వస్తాడు. ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే అతని నుంచి మరికొందరికి వ్యాపిస్తుంది. ప్రభుత్వం అప్రమత్తం అయ్యి.. మనిషికి మనిషికి మధ్య 20 అడుగుల దూరం ఉండాలని సూచిస్తుంది. ఈ వైరస్ దెబ్బకి దాదాపు లక్షకు పైగా జనాలు చనిపోతారు. రవాణా వ్యవస్థ స్థంబించిపోతుంది. ముంబై నుంచి ప్రజలు పారిపోవాలని చూస్తారు. ఈ వైరస్‌ను ముంబై నుంచి వ్యాప్తి చేయాలని చూసే వారిని కాల్చి వేయండి అని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుంది..’’. ఇదే వర్మ చెప్పిన కథ. దాదాపు కరోనా విషయంలో కూడా ఇప్పుడదే జరుగుతుంది. అందుకే 2018లో వర్మ చేసిన ఈ పోస్ట్ చూసిన వారంతా నువ్వు ‘బ్రహ్మ’వి స్వామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Comments