హితబోధలు :
‘‘సుయోధనా, యీ ఆంతరంగిక సమావేశంలో ద్రోణాచార్యుడొక్కడే వున్నమాట వున్నట్టు చెప్పాడు. నిజాలు చేదుగా వున్నా, వాటిని సంయమనంతో వినడం శ్రేయోదాయకం. పాండునందనులు సామాన్యులు కారు. భుజబలం వుంది. బుద్ధిబలం వుంది. దైవబలమూ వుంది. సమస్త శక్తులూ నిండుగా కలిగి వున్న పాండవులకు అరిష్టాలు అంత తేలికగా దరిచేరవు. అజ్ఞాతాసంలో వున్న అట్టి వారి వునికిని గ్రహించడం అంత సులువు కాదు. వారిపట్ల నాకు ప్రత్యేకమైన ఆత్మీయతలు వున్నాయని భావించకండి. నాకు అందరూ సమానులే. యథార్థాలు నిష్కర్షగా మాట్లాడి, సముచిత నిర్ణయాలు చేయడం మంచిది కాబట్టి యీ హితవచనాలు చెప్పాను. మరొక్క విషయం చెబుతున్నాను. బ్రాహ్మణభక్తి, పరోపకార చింత, వితరణ, ప్రభుభక్తి, బంధుప్రేమ, ధనధాన్య సమృద్ధి- యివన్నీ యుధిష్ఠురుడున్న చోట పుష్కలంగా వుంటాయి. అంతేకాదు, పాండవాగ్రజుడు పాదం మోపిన నేలపై గోజాతి తామర తంపరగా వర్థిల్లి, అమృత క్షీరధారలతో మానవజాతిని పరిపుష్ఠం చేస్తుంది. నేను చెప్పిన సదాచారాలు, ఐశ్వర్యాలు, భోగాలు ప్రస్ఫుటంగా కనిపించిన ప్రాంతంలో పాండవుల కోసం వెదకండి. అన్వేషణ ఫలిస్తుంది. అన్నివిధాల సుసంపన్నమైన ప్రదేశమే వారి వునికికి ఆనవాలు-’’ అంటూ ముగించాడు భీష్మాచార్యుడు. ప్రసంగంలోని శత్రుప్రశంసా వాక్యాలకు సుయోధనుడు లోలోన రోషపడ్డాడు. కర్ణునివంక సాలోచనగా చూశాడు. భీష్ముడు అంతా గమనించినా, రారాజు ప్రతిస్పందనకు సంజాయిషీ యివ్వదలచుకోలేదు.మళ్లీ కృపాచార్యుడు అందుకుని, ‘‘మహారాజా! పాండవులున్న ప్రదేశాన్ని గుర్తించడం మన ప్రథమ కర్తవ్యం. అరణ్యవాసం పూర్తి చేసి, ఏడాదిపాటు చేయవలసిన అజ్ఞాతవాసాన్ని కూడా ముగించడానికి సిద్ధంగా వున్నారు.
అందుకు ఆట్టే వ్యవధి లేదు. పాండవులు ఎక్కడ వున్నా, క్షణాలు లెక్కబెడుతూ వుండి వుంటారు. మనపట్ల ఆగ్రహం వారిలో రాజుకుంటూ వుంటుంది. వుపేక్షిస్తే యిది మనకు ముప తేవడం ఖాయం. వారిని ఎలాగైనా వెదికి పట్టుకుని, మళ్లీ అరణ్యాలకు పంపితే నిశ్చింతగా వుంటుంది. అగ్ని, రుణ, శత్రు శేషాలను వుంచడం శ్రేయస్కరం కాదు....’’ అనగా సుయోధనాదులు ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశారు. ‘‘...రాజా! మహాశక్తి సంపన్నులైౖన పాండవులను అల క్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. వెంటనే మన అపార చతురంగ బలాలను సన్నద్ధం చేయమని కోరుతున్నాను. పాండుపుత్రులు అజ్ఞాతవాసం ముగించుకు వచ్చి, సామరస్యంగా మన వద్దకు వస్తే సంధి కుదుర్చుకోవచ్చు. కాదని మహోద్ధతులై కయ్యానికి కాలు దువ్వితే దీటుగా నిలబడవచ్చు’’ అని హితవు పలికాడు. రారాజు అందరి మాటలూ సావధానంగా ఆకళింపు చేసుకుని, పెద్దలైన మీరు నా మాటలను కూడా ఆలకించండి. కీచకుడు, శల్యుడు, భీమసేనుడు, బలరాములవారు సమాన శక్తి సంపన్నులు. వీరొకరినొకరు ఓడించుకుని తామే విశ్వవిజేతలుగా ప్రకటించుకోవాలని నిరంతరం ఉత్సాహపడుతూ వుంటారు. వీరిని యెదుర్కొని నిలువగల వారు వేరెవ్వరూ లేరు. కీచకుని మట్టుపెట్టగల వారు ముగ్గురు మాత్రమే. ప్రస్తుతం గుట్టుగా మట్టుపెట్టి, వీరత్వాన్ని చాటింపక చాటుగా వుండవలసిన అవసరం ఒక్క భీమునికే వుంది. కనుక, కీచక, ఉపకీచక సంహార కాండ జరిపింది భీముడే. గంధర్వులని కట్టుకథను అల్లి ప్రచారం చేసి, తాము జన జీవనంలో కలిసిపోయి వుంటారు. అదీగాక యిపడు భీష్మ పితామహులు చెప్పింది నిజమే అనుకున్నా విరాటదేశం సశ్యశ్యామలంగా వుందని చారులు చెబుతున్నారు. మత్స్యదేశాధిపతి మనకు శత్రువు. తరచు మనల్ని కవ్విస్తూనే వున్నాడు కదా. ఇది అదునుగా తీసుకుని, పాండవులు మత్స్యదేశంలో తలదాచుకుని వుండవచ్చు’’ అని ఒక్క క్షణం ఆగాడు. ప్రాణమిత్రుడు కర్ణుని చూసి దరహాసం చిందించాడు రారాజు. కర్ణుడు సుయోధనుని వూహను చూపులతోనే ప్రశంసించాడు.‘‘... కనుక, మనం మత్స్యదేశంపై మెరుపు దాడి చేయవలె. విరటుని గోధనాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఒకవేళ పాండవులు ఆ రాజ్యంలో వుంటే, తమ రాజుకి యింతటి విపత్తు వచ్చినపడు బయటకు రాకపోరు. పోరు సాగించకపోరు. కీచక వంశం కూడా లేని మత్స్యదేశాధీశుడు నిస్సహాయుడు. ఆ జూదరి, అతని సోదరులు అజ్ఞాతం వీడినా మనకు జయమే. వారక్కడ లేకున్న, ధనంతోబాటు గోధనం మనకు దక్కుతుంది. అపడైనా జయం మనదే. దీనికి మీరు ఆమోదిస్తే, వెంటనే సముచిత సైన్యాలను సమాయత్తం చేస్తాం’’ అన్నాడు రారాజు.
మంతనాలలో పాల్గొన్న త్రిగర్త దేశాధిపతి సుశర్మ సుయోధనుని మాటలకు ఆనందించి కరతాళ ధ్వనులు చేశాడు. ‘‘మహారాజా, ఒకపడు సింహబలుడు కేకయ సాలదేశాధీశులతో చేయి కలిపి రణరంగంలో నన్ను గెలిచి నిలిచాడు. ఇపడు గంధర్వులు సింహబలుని చంపారు. కాని అతనిపై నా పగమాత్రం తీరలేదు. విరాటరాజు నాకు బద్ధశత్రువు. ఈ దండయాత్ర నాకు అప్పగిస్తే, సమర్థవంతంగా నిర్వహి ంచగలనని మనవి చేసుకుంటున్నాను’’ అన్నాడు వినయంగా. వెంటనే కర్ణుడు అందుకుని, ‘‘సుశర్మ ప్రతిపాదన సముచితంగానూ సమయోచితంగానూ వుంది’’ అన్నాడు. రారాజు చూపులో సమ్మతి ప్రతిఫలించింది. సుయోధనుడు సోదరుడు దుశ్శాసనుని పరికించి, మన పెద్దల అనుమతి తీసుకుని సైన్యం సన్నాహం జరిపించు. మొదట సుశర్మ తన సైన్యంలో మత్స్యదేశంపై విరుచుకు పడతాడు. గో సంపదను స్వాధీనం చేసుకుంటాడు. మరునాడు చతురంగ బలాలతో మనమందరం మత్స్యదేశాన్ని ముట్టడిస్తాం. ఇక అక్కడితో ఆటకట్టు!’’ అంటూ వికటాట్టహాసం చేశాడు. కర్ణుడు, సుశర్మ కూడా తమ నవ్వులు జోడించారు. మందిరం వారి నవ్వులతో ప్రతిధ్వనించింది. భీష్మద్రోణులు గంభీర ముద్రలు దాల్చి పరిస్థితిని గమనిస్తున్నారు.

Comments
Post a Comment