ప్రకటనలకే పరిమితమైన అధికారులు -నిత్యావసర సరుకుల ధరలు 10 నుంచి 30 శాతం వరకు పెరుగుదల



ఇష్టానుసారంగా పెంపు
లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల నుంచి సరకుల రాక బంద్‌
ఇదే అదనుగా రేట్లు పెంచేసిన వ్యాపారులు
25 కిలోల బియ్యం బస్తాపై రూ.100 నుంచి రూ.200 వరకు బాదుడు
పప్పులు, నూనెల ధరలు సైతం పెరుగుదల
కిలోకు రూ.10 నుంచి రూ.20 వరకు అధికం
ప్రకటనలకే పరిమితమైన అధికారుల హెచ్చరికలు
కిలో ఉల్లి రూ.40 
బియ్యం బస్తా రూ.1,600

మద్దిలపాలెం/అనకాపల్లి(విశాఖపట్నం): కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను నిత్యావసర సరుకుల వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సరుకులు అరకొరగా వస్తుండడం, మరోవైపు నిత్యావసరాల కోసం జనం ఎగబడుతుండడంతో ఇదే అదనుగా భావించి అధిక ధరలకు అమ్ముతున్నారు. పది రోజుల క్రితం వున్న ధరలతో పోలిస్తే ముఖ్యమైన నిత్యావసర సరుకుల ధరలు 10 నుంచి 30 శాతం వరకు పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలు ఎక్కడా అమలు కావడం లేదని అంటున్నారు. కూరగాయల ధరలు కూడా కొంతమేర పెరిగాయి. రైతుబజార్‌లోకన్నా బయట దుకాణాల్లో కిలోకు 10 నుంచి 20 రూపాయల వరకు అధికంగా రేట్లు ఉన్నాయి.

రోజురోజుకీ పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు పేద, మధ్య తరగతి వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా బియ్యం, మినపు పప్పు, శనగపప్పు, పెసర పప్పు, వంట నూనె, చింతపండు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, శనగ పిండి, మైదా పిండి, గోధుమ పిండి ధరలు పెరిగాయని చెబుతున్నారు. బియ్యం (25 కిలోల బస్తా) రకాలనుబట్టి గతంలో వున్న ధరలకన్నా రూ.100 నుంచి రూ.200 వరకు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. గోధుమ రవ్వ, గోధుమపిండి కొరత ఏర్పడింది. ఇవి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంటాయి.

గత పది రోజుల నుంచి సరుకు రాకపోవడం, జనం ముందు జాగ్రత్త పేరుతో అధిక మొత్తంలో కొనుగోలు చేయడంతో రెండు వారాలకు సరిపడా సరుకు ఐదు రోజుల్లోనే అయిపోయిందని అనకాపల్లి పట్టణానికి చెందిన హోల్‌సేల్‌ వర్తకుడొకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. గోధుమ పిండి (లూజు) గతంలో కిలో రూ.35 వుండగా, ఇప్పుడు రూ.45కు అమ్ముతున్నారు. ప్యాకెట్లు అయితే కిలో రూ.55లకు విక్రయిస్తున్నారు. పామాయిల్‌ లీటరు రూ.95, సన్‌ఫ్లవర్‌ అయిల్‌ రూ.105కు అమ్ముతున్నారు. 

ఆ ధరలు రైతుబజార్‌లకే పరిమితం
ప్రభుత్వం సూచించిన ధరలు రైతుబజార్లకే పరిమితమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లలో నిత్యావసర సరుకులు, కాయగూరల ధరలు వ్యాపారులే నిర్ణయించుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన ధరల్లో వారు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యావసర వస్తువులు, కాయగూరల అమ్మకాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే వ్యాపారులకు వరంలా మారింది. ఉదయం 11 గంటల తర్వాత సరకులు లభ్యమవుతాయోలేదని వినియోగదారులు ఉదయం నుంచి రైతుబజార్‌లలో క్యూలో నిల్చొంటున్నారు.

అంత సమయం వెచ్చించని, అంతమందిలోకి రావడం క్షేమం కాదని భావిస్తున్న చాలామంది రహదారులపై వున్న దుకాణాలు, కాయగూరల షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా వ్యాపారులు తమకు నచ్చిన ధరకు వస్తువులను విక్రయిస్తున్నారు. సాధారణంగా వీధుల్లోని కిరాణా దుకాణాదారులు పూర్ణామార్కెట్‌లోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో సరుకులు కొనుగోలుచేస్తారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు పెంచడంతో దుకాణదారులు కూడా ధరలు పెంచేశారు. షాపింగ్‌మాల్స్‌, ఆన్‌లైన్‌ మార్కెట్‌లలో ఈ ధరలు మరింత అధికంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌తో పనులు లేక అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలు భారంగా మారాయి. 

అనకాపల్లిలో కూరగాయల ధరలు....
అనకాపల్లిలో ఏర్పాటు చేసిన రైతు బజార్లలో ఉల్లిపాయలు కిలో రూ.35, వంకాయలు రూ.30, బెండకాయలు రూ.40, పచ్చిమిర్చి రూ.45, క్యాబేజీ రూ.30, క్యారెట్‌ రూ.50, దొండకాయలు రూ.30, బంగాళదుంపలు రూ.25, బరబాటి రూ.40, అల్లం రూ.100, బీట్‌రూట్‌ రూ.40, గోరుచిక్కుడు రూ.40, వెల్లుల్లి రూ.100లకు అమ్ముతున్నారు. బయట దుకాణాల్లో వీటికన్నా కిలోకు పది నుంచి 20 రూపాయల వరకు అదనంగా వేసుకుని విక్రయిస్తున్నారు. 

విశాఖపట్నంలో ధరలు ఇలా
సరుకులు             ప్రభుత్వ ధర   మార్కెట్‌ధర   మాల్‌ ధరలు
బియ్యం (బీపీటీ)             1200       1400        1600
బియ్యం (సోనా మసూరి)      800       1000        1335
చింతపండు                  -           160         174
కందిపప్పు                    95         120         145 
పెసరపప్పు                  117         130         148
మినపపప్పు                 120         140      155
శెనగపప్పు                   65           80      90
గోధుమనూక                45           50       49
గోధుమపిండి                35           50       48
పామాయిల్‌                 85           95       101
రిఫైండ్‌ ఆయిల్‌             100         110        110
వేరుశెనగనూనె             137          150        180
ఇడ్లీ రవ్వ                    35           50         55 
చక్కెర                      42           60         50
ఉల్లిపాయలు               30           40         40 
టమాటా                   16            30         30
వంకాయలు                20            40         80
బెండకాయలు              35            50         54 
పచ్చిమిర్చి                 20            40         50
కాకరకాయలు              24            40         54
కాలీఫ్లవర్‌                  14            30        52
క్యాబేజీ                    14            30         50
క్యారెట్‌                    26            40         58
దొండకాయలు             24            40         46
బంగాళదుంపలు           20            30        40
అల్లం                     90           110       120 
బరబాటి                  26            40        56
గోరుచిక్కుడు              28            40        54
దోసకాయలు              16            30        32
వెల్లుల్లి           90           120       138

Comments