బెబ్బులి గుహలో అడుగు పెట్టిన ఆడలేడిలా ఆమె బెదురుతూ లోనికి అడుగు పెట్టింది. సైరంథ్రిని చూడగానే సింహబలుని హృదయంలో హర్షావేశం తాండవించి, అది ముఖమంతా ప్రతిఫలించింది. వెంటనే తన విశాల వక్షస్థలం మీది ముత్యాల హారాలను సద్దుకుని, ఆమెకు యెదురు వెళ్లాడు. మాలిని ముక్తసరిగా వచ్చిన పని చెప్పింది. సింహబలుడు తన ధోరణిలో మాటలు మొదలు పెట్టాడు. సైరంథ్రి సౌందర్యాన్ని పొగిడాడు. తన బలాన్ని, బలగాలని ఏకరువు పెట్టాడు. అధికారాన్ని, తనకు గల ఐశ్వర్యాన్ని వివరించాడు. అపూర్వ మణి మాణిక్యాలతో శరీరాన్ని పొదగగలనన్నాడు. భవనాలు, ఉద్యానవనాలు, వస్తువాహనాలు లెక్కకు మిక్కిలిగా నీ సొంతం చేయగలనన్నాడు. నా కులకాంతలే నీకు చెలికత్తెలై నిన్ను సేవిస్తారు. నేను సైతం అడుగులకు మడుగులొత్తుతాను. సైరంథ్రీ, సరేనని వొక్కమాటతో నా వీనులకు విందు చేయవా - అని ప్రాధేయపడ్డాడు. శిలాప్రతిమలా నిలబడిన సైరంథ్రిని చూసి మదనోన్మాదంతో వివశుడై మరో అడుగు ముందుకు వేశాడు. ద్రౌపదిని బలమైన తన చేతులతో బంధించ యత్నించాడు.తన సమస్త శక్తులను తృటికాలంలో కూడతీసుకుని, ద్రౌపది ఒక్కసారిగా కీచకుని విసిరి కొట్టింది. అంతటి శక్తిని ఆమెలో సింహబలుడు వూహించలేదు. అనుకోని పరిణామానికి కీచకుడు పురుగులా దూరంగా పడ్డాడు. రెప్పపాటులో భవనం దాటి రాజవీధిలోకి నడిచింది పాంచాలి. కీచకుడు క్రోధావేశంతో లేచి, ఆమెను పెద్ద పెద్ద అంగలతో వెంటాడాడు. భీతితో మాలిని రాజవీధిన పరుగు వంటి నడకతో, కంట నీరు వొత్తుకుంటూ సాగుతోంది.

Comments
Post a Comment