సింహబలుడు :
విరాటరాజు పట్టమహిషి, సహోదరి అయిన సుథేష్ణాదేవిని చూడడానికి కీచకుడు అంతఃపురానికి వచ్చాడు. వచ్చీరాగానే వాని దృష్టి ద్రౌపదిని సోకింది. మహావీరుడు, సింహబలుడుగా పేరుగాంచిన కీచకుడు రాజుగారి బావమరిది. పైగా విరటుని సర్వసేనాధిపతి. రాజ్యానికి కీచకుడు పెద్ద అండ. సోదరిని ‘‘కొత్తగా వచ్చి, అంతఃపురానికే వినూత్న శోభ తెచ్చిన యీమె ఎవరు?’’ అని అడిగాడు సింహబలుడు. రాక్షస ప్రవృత్తిగల సోదరుని ఆంతర్యం గ్రహించిన సుథేష్ణ తడబడింది. కీచకుడు కనుబొమలు సారించి, రెప్పవేయక పాంచాలిని చూస్తున్నాడు. మహారాజుకి అతడే కండబలం, అతడే మనోబలం. పైగా ఎంతో కావల్సిన వాడు. మాలిని కేవలం అక్కగారి దాసి. కనుక, తను మనసు పడితే భంగపడే అవకాశమే లేదు. కీచకుని చూపులు ముళ్లవలెద్రౌపదిని గుచ్చుకుంటున్నాయి. వాని హావభావాలు, వాగ్ధోరణి కంపరం పుట్టిస్తున్నాయి. అప్పటికీ ఆమె అలక్ష్యం చేసి, రోషాన్ని దిగమింగి- ‘‘అన్నా, అక్క చెల్లెళ్లున్న వాడివి. నేను హీనవంశంలో పుట్టి, దాసి వృత్తిలో వున్నదానిని. నా యీ వేషభాషలు నీకు జుగుప్స కలిగించడం లేదా మా రాజా’’ అన్నది దీనంగా. కీచకుడు మాలిని మాటలకు విలాసంగా నవ్వాడు. అంగాంగ వర్ణనలో ఆమెను పొగిడి, తిరుగులేని తన కోర్కెను ముఖాముఖి వివరించాడు.
ద్రౌపది సింహబలుని దుర్భాషలను సహించలేక పోయింది. ఆగ్రహావేశాలు కమ్ముకున్నాయి. మర్యాదలు పక్కన పెట్టి, పరుష స్వరంతో, ‘‘కీచకా, నా భర్తలు అయిదుగురు. వారు శౌర్యనిధులు. శత్రు సంహార విద్యలో విశారదులు. దేవ అంశగల గర ధర్వులు. సాక్షాత్తూ ఇంద్రాదులు దిగివచ్చి, నీకు అభయం ఇచ్చినా ప్రయోజనం వుండదు. నీ మంచికోరి చెబుతున్నాను. రవంత ముందు వెనకలు ఆలోచించుకో. అధికార బలంతో, బల గర్వంతో అహంకరించి చావుని గడపలోకి పిలుచుకోకు సుమా’’ అని హెచ్చరించింది. సింహబలుడు హేలగా నవ్వి, ఆమె మాటలను తృణప్రాయంగా తీసి పారేశాడు. పరస్ర్తీలను ఆశించిన దుష్టాత్ముల బతుకులు ఎలా ముగిశాయో ద్రౌపది చెప్పింది. కీచకుడు నిర్లక్ష్యంగా సోదరి సుథేష్ణ దగ్గరకు పోయి, ‘‘ఆ జవ్వని నా వశం కావాలి. నీదే భారం’’ అన్నాడు. సుథేష్ణ పరిపరి విధాల నచ్చజెప్పడానికి ప్రయత్నించి, విఫలమైంది.మూర్ఖుని మనసు మార్చలేమని పట్టపురాణికి అర్థమైంది. మాట మీద మాట పెరగడం తప్ప, సమస్య పరిష్కారం కాదని తేటతెల్లమైంది. సోదరుని అనునయంగా చల్లబరిచింది. ‘‘నాయనా, కేవలం వొక దాసి పొందుకోసం నీవు యింతగా తపించనేల? మనమూ మన అంతస్తూ దృష్టిలో పెట్టుకుని నీకు చెప్పానుగాని, వేరేమీ కాదు. నాకు కొంచెం వ్యవధి యిస్తే, ఆమెను నయానో భయానో దారికి తెస్తాను. ఏదో వంకతో నీ మందిరానికి పంపుతాను’’- అంటూ వూరట పరిచింది మహారాణి. ఆ క్షణానికి యీ ఆపదకు తెరపడింది. తన ప్రాసాదానికి మరలి వెళ్లిన సింహబలుడు మాత్రం క్షణాలు లెక్కపెడుతున్నాడు. ఆ సౌందర్యరాశి రాకకోసం నిరీక్షిస్తున్నాడు. మందిరంలో ఎక్కడ అడుగుల సవ్వడి వినిపించినా సింహబలుడు వుత్సాహంగా, ఆత్రుతగా చూపులు సారిస్తున్నాడు. సోదరుని బుద్ధి సుథేష్ణకు పూర్తిగా తెలుసు. సింహబలుని తిరస్కరించి సింహాసనాన్ని కాపాడుకోవడం దుర్లభం. సుథేష్ణ తన భవనంలో అడుగు పెట్టినపుడే, మాలినిని వ్యక్తిగత పరిచారికగా వుంటుందని, భవనం దాటి వెళ్లే పనులు చెప్పనని మాట యిచ్చింది. ఇప్పడు మహారాణికి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఇక చేసేది లేక, మాలినిని పిలిచి కీచకుని భవనానికి వెళ్లి మద్యం తీసుకు రమ్మని ఆదేశించింది. ద్రౌపది తన ముఖ కవళికలలోనే అయిష్టతను వ్యక్తం చేసింది. రాణి యిచ్చిన మాటను వినయంగా గుర్తు చేసింది. సుథేష్ణ మరపు నటిస్తూ లౌక్యాన్ని ప్రదర్శించింది. ‘‘ఔనౌను. ఇలాంటి పనులు నీకు చెప్పనని నాడే చెప్పాను. అత్యవసరమై మాట మరచి నీకు చెప్పాను. అయినా అదేమీ పరాయి చోటు కాదని భావించాను’’ అంటూ, అందులో నిష్ఠూరాన్ని, అపరాధ భావననీ ధ్వనింప చేసింది. ‘‘రాణి కరకుగా వున్నా దాసి వుండకూడదు. అజ్ఞాతవాసంలో మగ్గేటపడు యివన్నీ తప్పవు’’ అని ద్రౌపది మనసు దిటవు చేసుకుని మదిర పాత్రతో సింహబలుని నివాసానికి బయలు దేరింది.

Comments
Post a Comment