‘30 రోజుల్లో ప్రేమించడమెలా’గో తెలుగువారికి చెప్పడానికి వెండితెర మీద దర్శనమివ్వబోతోంది అమృతా అయ్యర్. అవడానికి అమృత కన్నడ భామే అయినా ముందుగా మలయాళంతోనే వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా ఇలయ దళపతి విజయ్ ‘బిగిల్’ సినిమాలో కీర్తనగా తమిళ తంబీలకు మరింత చేరువైంది. ఇప్పుడు తెలుగువారిని తనఅందచందాలతో కట్టిపడేయానికి సిద్ధపడుతోంది. తొలి సినిమా విడుదల కాకుండా మరో రెండు సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అమృతా అయ్యర్‌తో...
మీ గురించి...?
మాది బెంగళూరు. నా చదువంతా అక్కడే! మా సిస్టర్ ప్రియాంక. తను మంచి డ్యాన్సరే కాదు బాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. తను కర్నాటక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. మాది చాలా సంప్రదాయ కుటుంబం. మా కుటుంబంలో ఇంత వరకూ నాకు తెలిసి ఎవరూ సినిమాల్లోకి రాలేదు. నేనే మొదటిదాన్ని.
సినిమాల్లోకి వస్తానంటే మీ పేరెంట్స్ ఏమీ అనలేదా?
చదువుకునే రోజుల్లోనే నేను మోడలింగ్ చేసేదాన్ని. సరదాగా మోడలింగ్ చేస్తానంటే ఒప్పుకున్నారు. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే మలయాళంలో అవకాశం వచ్చింది. ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తరువాత మానేద్దామని అనుకున్నాను. కోలీవుడ్‌లో విజయ్‌గారితో చేసిన ‘బిగిల్’ సూపర్ డూపర్ హిట్. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగులో నా మొదటి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడమెలా’. దీని షూటింగ్ జరుగుతున్నప్పుడే రెండు సినిమాలకు కమిట్ అయ్యాను. తెలుగులో నాగశౌర్యగారి పక్కన చేస్తున్న సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. వరుస అవకాశాలు వస్తుండడంతో వారు కూడా ఏమీ అనడం లేదు. నాతో కాంప్రమైజ్ అయిపోయారు.
తెలుగులో హీరో రామ్ సరసన చేస్తున్న ‘రెడ్’ సినిమా గురించి..?
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఓ పాత్ర చేస్తున్నాను. ఇది కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే థ్రిల్ ఉండదు.
ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
అనుకోకుండా నటిని అయ్యాను. ఇప్పటివరకూ ఫలానా పాత్ర చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఆలోచనే రాలేదు. భవిష్యత్తులో దానిగురించి ఆలోచిస్తానేమో!

Comments
Post a Comment