అరణ్యరోధన :
పట్టపగలు రాజవీధిలో ఒక మగువను వెంటాడి, వేటాడుతున్న సింహబలుని అడ్డుకునే వారే లేకపోయారు. అదిరాచనగరమా, కీకారణ్యమా! రాజబంధువులకు, రాజాశ్రితులకు నీతినియమాలు, ధర్మాధర్మ విచక్షణలు వుండవు కాబోలు- మనసులో రోదిస్తూ వడివడిగా పరుగిడుతోంది మాలిని. కొంతదూరం వెళ్లగానే కీచకుడు ఆమె కొపను చేజిక్కించుకున్నాడు. వుచితానుచితాలు వానికి తెలియవు. హీనస్వరంతో ద్రౌపది ఆర్తనాదాలు చేసింది. అంతా అరణ్యరోదనమే అయింది. అంతటి అవమాన వేళ, నిస్సహాయతలోంచి భగవదనుగ్రహంలాగా ఎక్కడలేని శక్తీ పుట్టుకు వచ్చింది. అంతటి మహాబలుడూ ఆమె ధాటికి తట్టుకోలేక నడివీధిన బోరగిలపడ్డాడు. ఆ భంగపాటుకు తత్తరపోయాడు. ఆ శక్తికి నివ్వెరపోయాడు. పురజనుల కంటపడితే అవమానం, అప్రతిష్ట అనుకుని, హతాశుడై దెబ్బతిన్న త్రాచులా బుసల నిట్టూర్పులతో కదిలాడు.సరిగ్గా, యీ ఆపదవేళ విరటుడు కొలువుతీరి వున్నాడు. ధర్మజ, భీమసేనులు సభామందిరంలో వున్నారు. ద్రౌపది నడివీధిన యెదుర్కొన్న ఘోరపరాభవాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు. వలలుని కన్నులలో దారుణ ఆగ్రహ జ్వాలలు రాజుకున్నాయి. బ్రహ్మాండభాండాన్ని చిదిమి వేయాలన్నంత వుద్రేకం అతని పిడికిళ్లలో వ్యక్తమవుతోంది. ఆకాశాన్ని, భూమిని చెరొక చేతా పట్టుకుని తాళాలుగా మోగించాలన్నంత విజృంభణ అతనిలో నిలువెల్లా ద్యోతకమవుతోంది. అజ్ఞాతవాసంలో అణగిమణ గి వున్న భీమన్నలో నిగ్రహం, నియమం కట్టలు తెంచుకున్నాయి. సభామందిరం పక్కన వున్న మహావృక్షం వైపు రెండు అంగలలో నడిచాడు. కీచకుని రాజసముఖంలోనే పరిమార్చాలని నిర్ణయించుకున్నాడు.
సింహబలుని శక్తిసామర్థ్యాలతో రాజ్యాన్ని పాలించే యీ రాజు వాడికేమి యెదురు చెప్పగలడు? మహావృక్షాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి వుద్యుక్తుడైన భీముడు, అక్కడే వున్న అగ్రజుని ఆనతికోసం చూశాడు. ధర్మజుడు కనుసైగతోనే తమ్ముని వారించాడు. సభలోని వారంతా వలలుని వుద్రేకాన్ని గమనించి, కారణం తెలియక తికమక పడుతున్నారు. కంకుభట్టు సమయ సందర్భాలను గ్రహించి, పెద్దగా నవ్వి నర్మగర్భంగా ‘‘పాకప్రవీణా, వంటచెరుకు కోసం పచ్చని చెట్లను పెకిలిస్తావా? వచ్చేపోయేవారికి తీయని పండ్లను, చల్లని నీడను యిచ్చే దానిని నిర్మూలించడం ధర్మం కాదు. ఎక్కడైనా ఎండిన మానులుంటే చూసుకో. లేదంటే భటులకు పురమాయిస్తే వారే సమకూరుస్తారు కదా!’’ అన్నాడు. ఆ మాటలలోని ఆంతర్యం బోధపడి, భీముడు కొంచెం చల్లబడ్డాడు. మరి గత్యంతరం లేని పాంచాలి విరటుని కొలువుకు వచ్చి నిలిచింది. కనుల నీరు తిరుగుతున్నాయి. అక్కడే వున్న ధర్మరాజుని, భీముని చూడనట్టే చూసింది. రాజుని, సభాసదులను ధీరగంభీరస్వరంతో సంబోధించింది. నా గర ధర్వపతులు అయిదుగురూ ధర్మవేత్తలు. దుష్టశిక్షణలో, శిష్టరక్షణలో ఆరితేరిన శూరులు. పరాక్రమంలో, శస్త్రాస్త్ర సంపదలో వారికి వారే సాటి. వారు నేడు నాకింతటి ఘోరపరాభవం జరిగినా, ఏమీ తెలియనట్టే వుపేక్షించి వూరుకున్నారు. మరి యింతటి అండదండలుగల నాకే యిట్టి స్థితి దాపురిస్తే, యీ రాజ్యంలో సాధారణ స్త్రీల గతియేమిటి? యీ నేలపై సౌశీల్యగౌరవాలతో మగువ మనగలదా? ఇందరు సదస్సులలో ఏ ఒక్కరికైనా కీచకుని దుశ్చర్య ఏవగింపు కలిగించలేదా? మత్స్యదేశాధిపతి విరాట మహీపతి ధర్మాధర్మ విచక్షణ గలవారు. ఏలినవారు సైతం కీచకుని అకృత్యాన్ని చూసీచూడనట్టు వ్యవహరించడం నా దురదృష్టం’’ ఆమె కంఠం గద్గదికమైంది. సభ మ్రాన్పడిపోయింది. మౌనముద్రతో తలవాల్చింది.విరటుడు ద్రౌపది స్థితికి జాలిపడ్డాడు. సింహబలుని హెచ్చరించగల ధైర్యం ఆయనకు లేదు. ఒక సాధారణ దాసి, నిండుకొలువులో రాజుని నిర్భీతిగా నిలదీసినా ఆయన ఆగ్రహించలేదు. విరటుడు సింహబలుని అతిసున్నితంగా మందలించి, నచ్చజెప్పే ధోరణిలో మాట్లాడి పంపించాడు. అణచుకున్న అక్కసుతో, కోపంతో వూగిపోతూ కీచకుడు తన నివాసానికి కదిలాడు. సభామండపం దిగి వెళ్లేవేళ, నిర్లక్ష్యంగా తలతిప్పి, ద్రౌపదిని తీక్షణంగా చూశాడు. ఆమె అస్సలు లక్ష్యపెట్టలేదు. సింహబలుని నిష్క్రమణతో సభ స్వేచ్ఛగా వూపిరి పీల్చుకున్నది. రాజు ముఖంలో అపరాధనా భావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. కాని నిస్సహాయుడు. మానవతికి అభయమివ్వగల ధైర్యం లేదు. మదోన్మత్తుని సమర్థించేంతటి దుర్బుద్ధిలేదు. ఆ క్షణాన రాజు అడకత్తెరలో పోక.

Comments
Post a Comment