మహాభారతం అందరికీ అర్దమయ్యేలా తెలుగులో (సరళ వ్యావహారికంలో)- 13TH భాగము


కీచకవధ:
నర్తనశాల పదఘట్టనలతో కంపిస్తోంది. తోక తొక్కిన పాముల వలె భీమ కీచకులు బుసలు కొడుతున్నారు. చీకటికి భయాందోళనలు తోడుకాగా, మాలిని నిలువెల్లా చలించిపోతోంది. పిడికిలి పోట్లు వురుములు లేని పిడుగుల వలె మందిరం నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయి. సింహబలుని శక్తి క్షీణించ సాగింది. ప్రత్యర్థి మరింత బలం పుంజుకున్నాడు. కీచకుడు డస్సిపోయి. పెనుగులాటలో పడ్డాడు. ప్రాణాలు దక్కించుకుని పారిపోయే ప్రయత్నమని భావించిన భీమసేనుడు మరింత శక్తిని కూడదీసుకుని లేడిపైకి దుమికిన సింహంలా లంఘించాడు. భీకర ముష్టి ప్రహారాలతో కీచకుని దేహాన్ని కుళ్లబొడిచాడు. ఆ కముకు దెబ్బలకు సింహబలుడు, విలవిల తన్నుకోవడం మొదలు పెట్టాడు. వాని దేహభాగాలు క్రమక్రమంగా చైతన్యరహితమై, కుప్పకూలాడు. అయినా, భీముని కసి తీరలేదు. కీచకుని వక్ష స్థలాన్ని చీల్చి పాదాలను, చేతులను, తలను వాని గుండెలోనికి చొప్పించాడు. సింహబలుని వెన్నుముక పుచ్చిన విల్లువలె పూసకొక్కటిగా విరిగింది. వలలుడు వంటవానిగా సిద్ధహస్తుడు. అంతటితో ఆగక, చుట్టచుట్టిన కీచకుని దేహాన్ని నేలపై పదేపదే మోదాడు. రొట్టెలపిండిని మర్దించినట్టు మర్దించి, మాంసపు ముద్దగా తయారు చేశాడు.
వాడు రాజవీధిలో ద్రౌపదికి చేసిన అవమానం గుర్తుకు రాగా, రోషావేశుడై భీముడు ఆ మాంసపుబంతిని తనివితీరా కాళ్లతో తన్నాడు. చేతులు దులుపుకున్నాడు. అంతచీకటిలో కూడా భీముని అరచేతులు విచ్చిన కమలాలవలె ఎర్రగా, రక్తసిక్తాలై కనిపించాయి.భీముడు సవ్వడి చేయక బయటకు నడిచి, చిన్నచిన్న చితుకులు తెచ్చాడు. ఆ మాంసపుబంతికి దగ్గరలో వాటిని పేర్చాడు. చెకుముకిలను రాపాడించి, నిప రాజేశాడు. చితుకుల మంట వెలుగులో కీచకుని దేహం స్పష్టంగా కనిపిస్తోంది. ద్రౌపది నాలుగు అడుగులు దగ్గరకు వేసి, కీచకుని కళేబర ఆకృతిని చూసి, సంభ్రమాశ్చర్యాలతో ముక్కున వేలేసుకుంది. ఆ దృశ్యం చూసిన భీముడు శ్రమ మరిచి సేదతీరాడు. ‘‘దేవీ, నీ మనసులో రగులుకున్న రోషజ్వాలలు ఆరినవి కదా. చూశావుగా వీడికెట్టి దుర్గతి పట్టిందో. దుస్సంకల్పంతో మన జోలికి ఎవరు వచ్చినా యిదే గతి’’ అన్నాడు. ద్రౌపది మరింత చేరువగా వచ్చి, ‘‘మహావీరా! నాడు విరటుని కొలువులో ఆగ్రహాన్ని ఎంతగా అణచి పెట్టుకున్నావో నాకిపడు అర్థమైంది. అంతటి మహాబలుని, యిపడు నిరాయుధుడవై, వొంటరిగా మట్టుపెట్టావు. నీ శక్తి సామర్థ్యాలను ప్రశంసించగల మాటలు నా దగ్గర లేవు’’ అన్నది. ఆమె పలుకులు అమృతపు చినుకులై భీమసేనుని మనసులో వర్షించాయి. ఒక్క క్షణం తన్మయుడై, వులిక్కిపడి ‘‘నడిరేయి దాటి చాలా సేపు అయింది. జాములు యీ చీకటి పొద్దున కదిలిపోతున్నాయి. ఆనందిస్తూ యిక్కడే నిలబడడం క్షేమం కాదు’’ అంటూ బయలుదేరాడు. నాలుగు అడుగులు వేసి, వెనుతిరిగి మాంసపు ముద్దను, పాంచాలిని మార్చి మార్చి చూసి సంతృప్తిగా వంటశాలకు దారితీశాడు వలలుడు.తగినంత వ్యవధి యిచ్చి, పాంచాలి నర్తనశాల ప్రాంగణంలోకి పరుగున వచ్చి, భయాందోళనలతో గొంతెత్తి అరవసాగింది. ‘‘నా గంధర్వపతులు సింహబలుని సంహరించారు. రండి, వచ్చి వీని దుస్థితి గమనించండి’’ అని నాటకీయంగా భయాన్ని అతిగా నటించడం మొదలు పెట్టింది.
ఆ నిశ్శబ్దవాతావరణంలో ఆమె కేకలు నగరమంతా ప్రతిధ్వనించాయి. కేకలు విన్న రాజభటులు పెద్దపెద్ద దివిటీలతో నర్తనశాలకు చేరారు. క్షణాలలలో వార్త నగరమంతా సోకింది. ఉపకీచకులు కొందరు ఆత్రుతగా పరుగున నిద్రముఖాలతో వచ్చారు. అక్కడ తమ అగ్రజుని ఆకృతి చూసి నిశ్చేష్టులైనారు. ఆ మాంసపు ముద్దపై పడి, గొంతెత్తి విలపించారు. రాజబంధువులు, రాజాధికారులు కీచకుని దుస్థితిని చూసి నిర్ఘాంతపోయారు. వారికి నోటమాట రాలేదు. ఇటువంటి ఘాతుకాన్ని తాము యింతవరకు కనీవినీ యెరుగమనుకున్నారు. పైకి కీచకుని దుశ్చర్యలను ప్రస్తావించగల ధైర్యము ఎవరికీ లేకపోయింది. ఇంతటి ఘనకార్యమును సాధించగల వారు మానవమాత్రులు కాజాలరు. వారు కచ్చితంగా గంధర్వులే అయి వుండాలని వచ్చిన వారంతా నిర్థారించుకున్నారు. మాలిని జోలికి వెళితే ఎట్టి దురవస్థ కలుగుతుందో అనడానికి యిదొక మచ్చుతునక కాబోలని కూడా ప్రజలు గుసగుసలాడుకున్నారు. ఒక్క కీచకునికి తప్ప రాజ్యమంతటికీ పొద్దు పొడిచింది.

Comments