పొద్దున్నే ఆకలి లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

  
 ప్రశ్న: నాకు నలభైఏళ్లు. గృహిణిని. ఉదయం ఏడు గంటలకే చాలా ఆకలి వేస్తుంది. ఒక కప్పు కాఫీ తాగినా సరిపోదు. ఇలా పొద్దున్నే ఆకలి లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
- సుస్మిత, హైదరాబాద్‌
జవాబు: పొద్దున్నే ఆకలి వేయడం ఆరోగ్యకరమైన విషయమే. ఉదయం ఆకలిగా అనిపించినప్పుడు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. లేవగానే కాఫీ, టీలకు బదులు ఓ కప్పు పాలు, పెరుగు లేదా మజ్జిగతో ఆకలి తీర్చుకోవచ్చు. దీంతో శక్తి వస్తుంది. వీటితో పాటు ఇంటి పని చేసుకుంటూనే నాలుగైదు బాదం గింజలు, రెండు ఆక్రోట్‌ గింజలు కూడా నోట్లో వేసుకోండి. ఫలితంగా తొమ్మిది గంటలకు అల్పాహారం తీసుకునే వరకు ఆకలి లేకుండా ఉంటుంది. ఉదయం ఉన్న ఉత్సాహమే సాయంత్రం వరకు కొనసాగాలంటే శరీరానికి అన్ని వేళల్లో తగినంత శక్తినిచ్చే ఆహారం ఇస్తూ ఉండాలి. సాధారణంగా స్త్రీలు సమయాభావం వల్ల ఉదయం అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీని వల్ల నీరసం వస్తుంది. మధ్యాహ్నం భోజన సమయానికి బాగా ఆకలి వేస్తుంది. ఉదయం సమయం తక్కువగా ఉంటే, తేలికగా తినడానికి వీలయ్యే ఉడికించిన గుడ్లు, పండ్లు, పాలు లేదా పెరుగు వంటివి ఎంచుకోండి.

Comments