సభాసదులు తమకు తోచిన విధంగా గుసగుసలాడుకుంటున్నారు. అసలింతటి సౌందర్యరాశి సైరంథ్రిగా కుదరటమేమిటోనని కొందరు ముక్కున వేలేసుకున్నారు. పట్టపగలు దేశసేనాధిపతే యింతటి అమానుషానికి పాల్పడడమా, కంచే చేను మేసినట్టుంది- అని కొందరు వ్యాఖ్యానించారు. అసలు రాజు అసమర్థుడైనపడు యిలాగే వుంటాయని కొందరు వ్యంగ్యధోరణిలో మాట్లాడారు. ‘‘సుధేష్ణాదేవి వుపేక్షించి, ప్రోత్సహించడమే దీనికి కారణం’’ అన్నారు కొందరు. విజ్ఞులు రకరకాలుగా చర్చించారు. అందరూ జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించారు. కాని పెదవి విప్పి పరుషంగా మాట్లాడే ధైర్యం రాజుకే లేకపోయె. సాత్వికులైన సభికులు బాధతో, జాలితో తలలు వంచి నిట్టూర్చారు. అంతకుముందే ధర్మజుని మనసులో రోషం కోడెత్రాచై, పైకెగసి బుసకొట్టి, పడగ విప్పి, కోరసాచింది. ఆయన నుదుటిపై స్వేదం కమ్ముకొని, అది రోషమై, జాలియై, నిస్సహాయతయై, నీటికంటె పల్చనై చెంపలపైకి జారింది. ఆ గంభీరమూర్తి అరచేతితో స్వేదబిందువులను అద్దుకుని, ప్రశాంతవదనంతో, మృదుస్వరంతో-‘‘సాధ్వీమణీ, మహారాజుతోబాటు సభాసదులంద రూ నీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నారు. ఇక ఎక్కువగా తర్కించడం వల్ల ప్రయోజనం ఏముంది? రాణిగారి మందిరానికి వెళ్లి వూరట చెందడం మంచిది. నీ గంధర్వపతులు విశ్వాన్నే జయించగల సమర్థులని పదేపదే చెబుతున్నావు. వారు ఆగ్రహంతో ప్రజ్వలించడం ప్రస్తుత పరిస్థితిలో శ్రేయస్కరం కాదని నా భావన. పెద్దల సాన్నిధ్యంలో నీవంటి వుత్తమ యిల్లాలికి యీ వైఖరి తగదు సుమా’’ అని హితవు పలికాడు. ఆమె ధర్మజుని మాటలు విని మరింత రోషపడింది. అది గ్రహించిన పాండవాగ్రజుడు, ‘‘సైరంథ్రీ, సభామధ్యంలో నర్తకి వలె ప్రవర్తించకు. కులసతివలె మీ రాణిగారి సేవకు బయలుదేరు’’ అన్నాడు హెచ్చరికగా.మాలిని సాభిప్రాయంగా చూసి, ‘‘కంకుభట్టారకా! నా ప్రాణేశ్వరుడొకరు నటశేఖరులు! అందుకే నేను నర్తకినైనాను. పతిపాండిత్యమే నాకు కొంత సంక్రమించింది. అంతేకాదు, నా భర్త నాట్యవిద్యతోబాటు ద్యూతకేళిలో ప్రవీణుడు. జూదరి ఆలికి పదిమందిలో గౌరవమర్యాదలతో నడచుకోగల మెళకువలుంటాయా?’’ అన్నది. ఆ మాటలకు ధర్మజుని ముఖం వివర్ణమైంది.

Comments
Post a Comment