పదో తరగతి కూడా చదవలేదు.. కానీ డాక్టర్లనే బోల్తా కొట్టించి.. రూ.40 లక్షల మోసం

మియాపూర్‌ మదీనగూడ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్‌ను ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో ముంబైకి చెందిన దంపతులు రూ.23.90లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. రామకృష్ణ గౌస్‌కొండ, మిట్టు గౌసుకొండ అనే దంపతులు వాట్సాప్‌లో డాక్టర్‌ను పరిచయం చేసుకున్నారు. కొద్దిరోజుల తరువాత తాము ఫోరెక్స్‌ ట్రేడింగ్‌లో వ్యాపారం చేస్తున్నామన్నారు. కస్టమర్‌లకు మంచి టిప్స్‌ ఇచ్చి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా చేస్తున్నామని నమ్మించారు. మీరు కూడా ఫోరెక్స్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు సంపాదించ్చని నమ్మబలికారు. రూ.1లక్ష పెట్టుబడి పెడితే 9 నెలల్లో పెట్టుబడితో కలిపి మూడు లక్షలు చెల్లిస్తారు అంటూ.. తమ సైబర్‌ తెలివితేటలు ప్రదర్శించారు. ఆ దంపతులు చెప్పిన మాటలు పూర్తిగా నమ్మిన డాక్టర్‌.. వాళ్లు చెప్పిన విధంగా 5నెలల్లో మొత్తం రూ.23.90లక్షలు ఆన్‌లైన్‌లో ఫోరెక్స్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడిగా పెట్టారు. ఆ డబ్బులు చేతికందిన తర్వాత ఆ సైబర్‌ దంపతులు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. పోలీసులను ఆశ్రయించిన డాక్టర్‌ తనగోడు వెల్లబోసుకున్నాడు.
కేవైసీ అప్‌డేట్‌ అంటూ..
పేటీఎంలో కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ నమ్మించి ఓ డాక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు రూ.4లక్షలు కొట్టేశారు. సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్‌ ఫోన్‌కు ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మీరు ఉపయోగిస్తున్న పేటీఎం వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. వెంటనే కేవైసీ వివరాలు, ఖాతా వివరాలు అప్‌డేట్‌ చేయాలని ఉంది. దాంతో పాటు వచ్చిన గూగుల్‌ లింక్‌ను ఓపెన్‌ చేశాడు. వెంటనే అందులో ఉన్న అన్ని వివరాలు పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని బ్యాంకు వివరాలన్నీ సైబర్‌ నేరగాళ్లకు చేరిపోయాయి. అంతే..! నిమిషాల్లో ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యాయి. మొత్తం రూ.4.00 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయానని గుర్తించిన డాక్టర్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

Comments