ఇంతలో వే గుల నాయకుడు ఏదో స్ఫురించిన వాని వలె, ‘‘మహారాజా! తమరికొక విశేషము విన్నవించాలి. మత్స్యదేశాధిపతి బావమరిది కీచకుడు తమ అంతఃపురంలో సైరంధ్రీ వృత్తి సాగిస్తున్న ఒక లావణ్యవతిని వశపరచుకోజూచాడట. మరునాడు సింహబలుడు మాంసపు ముద్దగా మారినాడట. ఆమె భర్తలు గంధర్వులనీ, మహాబలశాలురనీ వింతగా చెపకుంటున్నారు. నూట అయిదుగురు వుపకీచకులు సైతం వారి చేతిలోనే నిహతులైనారట. ఆ గంధర్వులు ఎక్కడివారో, వారి రూపు రేఖలు ఎటులుండునో యెవ్వరికీ తెలియదు. విరాటరాజు మన శత్రువర్గంలోని వాడు కదా! మేము విన్న వింతలు తమ దివ్యచిత్తానికి తెస్తున్నాము. తరువాత మా కర్తవ్యం ఏమిటో సెలవివ్వండి’’ అన్నారు. ‘‘సరే, మీరిక వెళ్లచ్చు. మళ్లీ కబురంపుతాం’’ అని వారిని పంపించి వేశాడు రారాజు. సుయోధనుని మనసు వికలమైంది. ఎట్లాగైనా అజ్ఞాతదీక్షలో పాండవుల జాడ గుర్తించి, వారిని శాశ్వతంగా రాజ్యభ్రష్టులను చేయాలి. అక్కడి వారివైపు చూసి, చెప్పండి. దీనికి వుపాయం వెంటనే చెప్పండి’’ అన్నాడు. ‘‘మారు వేషాలలో మరింత శోధన జరిపితే వారి వునికి లభించకపోదు’’ అన్నాడు. రాధేయుడు, దుశ్శాసనుడు అన్నగారి వైపు చూసి, అహంకారావేశాలు నిండిన నవ్వొకటి నవ్వి, ‘‘అర్భకులైన పాండవుల కోసం వెదకుట వృథాప్రయాస. వారీపాటికి ఏ క్రూరమృగాలకో ఆహారమై వుంటారు. వారి గోడును విస్మరించి, సామ్రాజ్యలకి్క్షని, భోగభాగ్యాలతో నిశ్చింతగా అనుభవించుటే మన తక్షణ కర్తవ్యము’’ అన్నాడు. దుశ్శాసనుని ధోరణిని ద్రోణాచార్యుడు అధిక్షేపించాడు. పాండవులను విశ్లేషించాడు. ‘‘సుయోధనా, పాండుసుతులు క్షాత్రశక్తిసంపూర్ణులు. ప్రాజ్ఞులు మెచ్చిన సచ్చరిత్రులు. వారికి గల దైవబలం వేరొకరికి లేదు. వారికి ఘోర ఆపదలు సంభవించడం కల్ల. మన మనసు ఆహ్లాదించే తీరులో శత్రువు బలాన్ని శంకించడం వివేకం కాదు. మనల్ని మనం తాత్కాలికంగా మోసం చేసుకోవడం వినాశ హేతువు అవుతుంది. ఈ సందర్భంలో వుపేక్ష అత్యంత ప్రమాదకరం’’ అన్నాడు గర భీర స్వరంతో. మంతనాలు సాగుతున్న రారాజు మందిరం కొద్దిక్షణాలు నిశ్శబ్దంతో కరడు కట్టింది. అందరూ భీష్ముని వైపు చూశారు. ఆయన చూపులు నిశితంగా వున్నాయి. తీవ్రంగా ఆలోచిస్తున్న భీష్ముని మనసుని ఆయన ముఖం ప్రతిబింబింప చేస్తోంది.

Comments
Post a Comment