ఎవరా గంధర్వులు:
ఆ మాటకు పాంచాలి విలాసంగా నవ్వి, ‘‘బృహన్నలా! రాచకన్నెల ఆటపాటలు తప్ప నీకు యింకేమీ పట్టదు కదా. లేకుంటే యింత విపత్తు జరిగిన తర్వాత నన్నిట్లా ప్రశ్నించగలవా?’’ అని అధిక్షేపించింది. వెంటనే అర్జునుడు గర భీరస్వరంతో, ‘‘మాలినీ! అజ్ఞాతవాసం కనుక అణిగి మణిగి వుండక తప్పదు. లోలోపల ఎంత వేదన వున్నా, వెల్లడించలేను కదా’’ అన్నాడు. ద్రౌపది సరసోక్తులతో బృహన్నల మనసును తిరిగి కుదట పరిచింది. ‘సమయోచితంగా నువ్వు ప్రవర్తించిన తీరు నాకు ఆనందం కలిగిస్తున్నది’’ అన్న మాలిని మాటలు అర్జునుని వూరట పరిచాయి. ఆమె బృహన్నల వద్ద సెలవు తీసుకుని, అంతఃపురంలో అడుగు పెట్టింది. సోదరులందరినీ పోగొట్టుకున్న సుధేష్ణాదేవి కుమిలి కుమిలి దుఃఖిస్తోంది. మాలిని మనసులో ఆనందం పెల్లుబుకుతున్నా, పైకి ఏమాత్రం స్ఫురించనీయలేదు. ఆమెను చూడగానే భయశోకావేశాలు మహారాణిలో ముప్పిరిగొన్నాయి. అయినా అతి గౌరవంగా సైరంథ్రిని దగ్గరగా కూర్చోబెట్టుకుంది. సుధేష్ణకు మాలిని గోధుమ వన్నె త్రాచువలె కనిపిస్తున్నది. పొరలి వచ్చే దుఃఖాన్ని దిగమింగి, ‘‘మాలినీ! నీ అందచందాలు మగవారికి ప్రాణాంతకం కాగలవని మహారాజు భయభ్రాంతులవుతున్నారు. నీ భర్తల పరాక్రమం అసామాన్యమైంది. నిన్ను కన్నెత్తి చూడడానికే కాదు, మనసున వూహించడానికి సైతం నగరపౌరులు గజగజలాడుతున్నారట. అన్యథా భావించక, మా రాజ్యం వదలి వేరెక్కడైనా నివసించమని నా ముఖతః రాజుగారు నిన్ను కోరుతున్నారు’’ అంటూ సుధేష్ణ అప్రయత్నంగా చేతులు జోడించింది. వూహించని పరిణామానికి క్షణకాలం మనసు మొద్దుబారింది. తృటిలో తేరుకుని, ‘‘మహారాణీ! కేవలం నేను మీ పరిచారికను. ఇంతగా అభ్యర్థించడమెందుకు, మీ ఆజ్ఞను శిరసావహించడమే నా స్థాయి. ఇంతకాలం నన్ను ఆదరంగా చూసుకున్నారు. మరొక్క పదమూడు రోజులు గడువు దయచేయండి’’ అని మాలిని ప్రాధేయపడింది.
నొప్పించకుండా యీమెను వొప్పించగలిగాను. ఎటొచ్చీ పదమూడు రోజులు వ్యవధి మాత్రమే కదా ఆమె అడుగుతోంది. ఎంతైనా సాటి ఆడకూతురు. నిర్దయగా పొమ్మనడం మనస్కరించక సైరంథ్రి అడిగిన గడువుకి సుధేష్ణాదేవి సమ్మతించింది. ‘‘మాలినీ, యికపై నీవు నా భవనంలో ఒక మిత్రురాలివలె వుండవచ్చును. నువ్వు, నీ పతులు మమ్ములను, మా రాజ్యాన్ని కనిపెట్టి వుండండి. యిదే నా కోరిక’’ అన్నది మహారాణి. ఆ మాటలకు ద్రౌపది వినయంగా రాణికి నమస్కరించింది.అంతఃపురంలో సంగతులు యిట్లా వుండ గా, పురంలో కీచక, ఉపకీచకుల దిక్కులేని చావుల గురించి ప్రజలు కథలు కథలుగా చెపకుంటున్నారు. చిన్న ఆయుధం లేకుండా కీచకులమొలక భూమిపై లేకుండా చేసిన ఆ గంధర్వులెంత పరాక్రమవంతులో! సూతవంశం రూపు మాసిపోయింది. మత్స్యదేశాధిపతి బలం సమూలంగా కుంగిపోయింది. ఇలాంటి విడ్డూరం ఎన్నడూ మనం కనలేదు, వినలేదు- అనుకుంటోంది ప్రజానీకం. యీ వార్త క్రమంగా చుట్టుపక్కల రాజ్యాలకు పాకింది. ఏనోట విన్నా కనిపించని గంధర్వుల బలపరాక్రమ గాథలే వినిపిస్తున్నాయి. పాండవులు అజ్ఞాతవాసం ప్రారంభించగానే దుర్యోధనుడు వారి వునికిని పసిగట్టడానికి ప్రత్యేక గూఢచారి బృందాలను నియమించాడు. వారికి చెప్పిన గడువు పూర్తి కావస్తూ వుండడంతో, వారు నిరాశతో హస్తినకు మరలారు.భీష్మ, ద్రోణ,కర్ణాదులతో మంతనాలు సాగిస్తున్న సుయోధనుని వేగుల వారు సందర్శించారు. వారు పాండవుల అజ్ఞాతవాస దీక్షను భంగపరచి, తిరిగి వనవాసానికి పంపేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గూఢచారులు వినమ్రంగా రారాజుకు నమస్కరించి, తమ తమ ప్రయత్నాలను వివరించారు. ‘‘అరణ్యాలు, కొండకోనలు గాలించాము. ద్వారకాపురిలో వుండవచ్చునని అనుమానించి, అక్కడ అన్వేషించాం. దేశదేశాలు తిరిగాం. విసిగి వేసారినాము గాని వారి జాడ మాత్రం దొరకలేదు. పాండవేయులు బహుశా యీ లోకంలోనే వుండి వుండకపోవచ్చు. మరణించి వుంటారని మేము భావిస్తున్నాము మహారాజా!’’ అంటూ మనవి చేశారు. ఆ మాటలకు సుయోధనుడు శుభవార్త విన్నవాని వలె వుత్సాహంగా నవ్వాడు. కర్ణుడు శ్రుతి కలిపాడు. భీష్మద్రోణులు సాలోచనగా తలపంకించి, గంభీర ముద్ర దాల్చారు.

Comments
Post a Comment