ఉపకీచకసంహారం :
ఆలోచన వచ్చినదే తడవుగా, ఉపకీచకులు మాలినిని యీడ్చుకు వచ్చారు. అనరాని మాటలు అన్నారు. అక్కడ చేరిన వారంతా భయపడుతూ, చోద్యం చూస్తున్నారు. ద్రౌపదిని కీచక మాంసపు ముద్దపై వేసి, తాళ్లతో కట్టారు ఉపకీచకులు. నర్తనశాల ప్రాంగణం నుంచి శవశకటం బయలు దేరింది. ఉపకీచకులు, బంధువులు శకటం వెంట నడుస్తున్నారు. పాంచాలి కొద్దిపాటి స్పృహతో కొట్టుమిట్టాడుతోంది. మృత్యు శకటం శ్మశానం వైపు వెళుతోంది. అరుపులు, కేకలు వాటికి తోడు దుర్గంధం. ‘‘భూమిపై యింతకు మించిన కష్టాలు వుంటాయా?’’ అని దుఃఖిస్తూ పాంచాలి ఒక్కసారిగా గొంతెత్తి ఆక్రోశించింది. జయా! జయంతా! విజయా! జయత్సేనా! జయద్బలా! చూడండి. నన్ను ప్రాణాలతోనే ప్రేతభూమికి తీసుకు వెళుతున్నారు. ఎందరినో కటాక్షించి రక్షించిన మీరు నాపట్ల ఎందుకు వుపేక్ష చూపుతున్నారు. శౌర్యసింహాలు, సర్వ సమర్థులు, వుదార స్వభావులు మీరు. గర ధర్వ ప్రాణేశ్వరులారా, నేను బుగ్గికాక మునుపే, నన్ను కాపాడండి’’. ద్రౌపది ఆక్రందనలు విరాట కొలువు మొదలు అశ్వశాల వరకు ప్రతిధ్వనించాయి. సాధుపుంగవుని వలె విరటునికి కుడిభుజంగా వున్న కంకుభట్టు ఆమెను రక్షించే స్థితిలో లేడు. నాట్యాచార్యునిగా అజ్ఞాతద్వీపంలో వున్న అర్జునుడు యిపడు అసహాయుడు. నకుల సహదేవులు పశుల కాపరులు. వారు హద్దుమీరితే అజ్ఞాతవాసం భంగమై తిరిగి మొదటికి వస్తుంది. పాకశాలలో అగ్ని కీలలు వువ్వెత్తున ఎగిసి పడ్డాయి. వలలుని కన్నులు చింతనిపలు కురుస్తున్నాయి. ఉత్తర దిశగా సాగుతున్న శకటాన్ని, పాంచాలి దుస్థితినీ గమనించాడు.వలలుడు ఒక్క దూకులో ప్రాకారాన్ని లంఘించి, అడ్డదారుల సాగిపోయి ప్రేతభూమిని సమీపించాడు. కీచకుని మృత కళేబరంతో ఉపకీచకుల ఆర్తనాదాల మధ్య వస్తున్న వాహనానికి అడ్డు నిలిచాడు.
భీముడు తుంగపోచను పెకిలించినంత తేలికగా పెద్ద తాడిచెట్టును పెకలించి చేతపట్టాడు. అపడే వుదయించిన శుక్రనక్షత్రాలవలె భీముని కనులు జ్వలిస్తున్నాయి. ఆ మహాకాయుని చూసి, ఉపకీచకులు వొక్కసారి నిశ్చేష్టితులైనారు. బహుశా యితడు మాలిని గంధర్వపతులలో వొకడై వుండవచ్చునని భావించారు. తన అన్న సింహబలుని మాంసపు ముద్దగా మలచిన వానికి మనమెంత? అనే ఆలోచన రాగానే ఉపకీచకుల గుండెలలో గుర్రాలు పరుగెత్తినాయి. ప్రాణాలు అరిచేతులలో పెట్టుకుని వారంతా తలొక దిక్కుకూ పరుగులు ప్రారంభించారు. కొందరు నగరం వైపు పరుగు తీస్తున్నారు. పొదలలో కొందరు నక్కారు. ప్రాణభీతితో కొందరు చెట్లెక్కి కూచున్నారు. దగ్గరలో వున్న చెరువులో కొందరు తలదాచుకున్నారు. అడుగు పడని కొందరు అక్కడే కూలపడ్డారు. మరికొందరు పాదాలపై పడి క్షమాభిక్ష కోరారు. భీముడు మహావృక్షాన్ని గరిట తిప్పినంత అలవోకగా తిపతూ, దొరికిన వారిని దొరికినట్టు మోదుతున్నాడు. ఉపకీచకులు ఆ హింసకు ఆక్రందనలు చేస్తుంటే, భీముని మనసు వూరట చెందింది.
ఎవ్వరినీ వదలక, వెదికి వెదికి, తరిమి తరిమి ఉపకీచకులను సంహరించాడు. కీచక మొలక అనేది లేకుండా చేసి, భీముడు తృప్తిగా శవాల గుట్టలవైపు చూశాడు. వెంటనే కట్టుతాళ్లు విప్పి పాంచాలికి బంధవిముక్తి కావించాడు. దుఃఖిస్తూ ద్రౌపది ఏదో మాట్లాడ బోయింది. ‘‘ఇది సమయం కాదు. నువ్వు వెంటనే సుధేష్ణాదేవి మందిరానికి వెళ్లు. ఒక గండం తప్పిందనుకుంటే, మరొక గండం వచ్చే ప్రమాదం వుంది’’ అని హెచ్చరించి ఆమెను పంపేశాడు. తను వేరొక దారిలో పాకశాలకు చేరుకున్నాడు.కీచకునితోబాటు వాని సహోదరులందరూ నిశ్శేషంగా నిహతులైనారన్న వార్తకు విరటుడు బాధపడ్డాడు. సోదరులంతా చనిపోయారన్న సంగతి తెలిసిన సుధేష్ణాదేవి దుఃఖించింది. మాలినికి మహారాణిని వోదార్చుటకు మాటలు లేవు. సర్వ వినాశనానికి తానే కారణమని సుధేష్ణాదేవికి తెలుసు. ఇక సైరంథ్రి ఏమని పరామర్శించగలదు? మహారాణిని పలకరించడానికి అంతఃపురానికి వచ్చాడు విరటుడు. ఆమెను అనునయించి, ‘‘దేవీ! యిక యీమెను యిక్కడ వుంచడం శ్రేయస్కరం కాదు. ఆమె రూపలావణ్యాలను చూసిన పురుషుడెవడైనా ఆకర్షితుడు కాకమానడు. అయినంతనే వానికి చావు తప్పదు. కొన్నాళ్ళకు మన రాజ్యమున పురుషులే మిగలని దుస్థితి రావచ్చును. నువ్వు మాలినితో మృదుమధురంగా, లౌక్యంగా మాట్లాడి, ఆమెను నొప్పించకుండా తప్పించే మార్గం ఆలోచించు. ఆమెకు యీశకోశాన సందేహం రాకూడదు సుమా’’ అని పదేపదే గుర్తు చేశాడు. సుధేష్ణాదేవి సాలోచనగా తలవూపింది. సైరంథ్రి కీచక పీడా పరిహారంతో అరిషడ్వర్గాలను జయించిన బుద్ధివలె నిర్మలంగా వుంది. సేదతీరిన ఆమె రాజవీధిన వెళుతుంటే, కొందరు పురజనులు బెబ్బులిని చూసిన లేళ్లగుంపువలె బెదిరిపోయారు. కొందరు వ్యంగ్య ధోరణిలో గుసగుసలాడుకున్నారు. కొందరు పెడమొగంతో తొలగిపోయారు. అన్నిటినీ గమనించిన ద్రౌపది లోలోన నవ్వుకుంది. రాణిగారి అనుమతి తీసుకుని రాకుమార్తెల లాస్య విన్యాసాలను చూడాలని కుతూహలంగా వుందనే మిషతో మాలిని నర్తనశాలవైపు నడిచింది. అక్కడి రాచకన్నెలు సైరంథ్రిని అభినందనలతో ముంచెత్తారు. ద్రౌపది కళ్లు నర్తనశాలను కలయ చూస్తున్నాయి. గడచిన రాత్రి చీకటిమాటున ఎక్కడెక్కడ ముష్టియుద్ధం జరిగిందో, సింహబలుడు ఎక్కడ తుదిశ్వాస వదిలాడో గమనిస్తోంది. అంతలోనే బృహన్నల పలకరించి, సైరంథ్రీ జరిగిన కథంతా నీ ముఖతః వినాలని వుందన్నాడు.

Comments
Post a Comment