మహారాజు, సుధేష్ణాదేవి వచ్చి, ఆ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. ‘‘తరువాత జరగాల్సిన కార్యక్రమం సంగతి చూడండి. ఎంత విలపించినా పోయిన వాడు రాడు కదా’’ అని ఉపకీచకులను వోదార్చి వెళ్లారు. కీచకుని దహన విధులకు సిద్ధమవుతున్న సోదరులకు దూరంగా మాలిని కనిపించింది. వారిలో కోపోద్రిక్తాలు తిరిగి మేల్కొన్నాయి. ‘‘ఈ పాపాత్మురాలి వల్లనే మన అన్నకు యీ దుర్గతి దాపురించింది. సహగమనమే మన సోదరుని ఆత్మకు శాంతి కలిగించగలదు. ఆమె పెడరెక్కలు విరిచి కట్టండి. సజీవంగా సైరంథ్రిని చితిపైకి ఎక్కించి బూడిద చెయ్యాలి’’- అనే నిర్ణయానికి వచ్చారు ఉపకీచకులు. పాకశాలలోని పనివారందరూ కీచక వృత్తాంతం కథలు కథలుగా చెపకుంటున్నారు. సింహబలుని సంహరించిన మహాబలుని మహాశక్తిని వారంతా వేనోళ్ల పొగుడుతుంటే, దానినాలకిస్తున్న భీముని తనువు, మనసు దూదిపింజకంటె తేలికై గాలిలో తేలిపోతున్నాయి. ఉపకీచకులు అనుమతి కోసం రాజును దర్శించారు. ‘‘మా సోదరుని దుర్మరణానికి హేతుభూతమైన సైరంథ్రిని బూడిద చేయడానికి నిశ్చయించాం. మీకు తెలియజేయడానికి వచ్చాం-’’ అన్నారు. ఈ దశలో వారిని ఆపినా ఆగరని విరటునికి అర్థమైంది. ‘‘మీకు తోచిన విధంగా చేయండి’’ అన్నాడు రాజు ముక్తసరిగా. కంకుభట్టు చేష్టలుడిగి చూస్తున్నాడు. ఉచిత సలహాలకు అది సమయమూ కాదు, సందర్భమూ కాదు- అనుకుని, ఆందోళనను కప్పిపుచ్చుకుని మిన్నకున్నాడు

Comments
Post a Comment