మహాభారతం అందరికీ అర్దమయ్యేలా తెలుగులో (సరళ వ్యావహారికంలో)- 11TH భాగము

 
తెల్లవారింది. సింహబలుడు సముచిత ప్రాతఃకాల విధులు ముగించాడు. ఏరికోరి, ఎంపిక చేసిన వస్త్రధారణ చేశాడు. విలువైన విభూషణాలను అలంకరించుకున్నాడు. వాని హృదయమంతా మాలిని గురించిన వూహలే. వడివడిగా సుధేష్ణాదేవి మందిరానికి బయలుదేరాడు. దారి పొడుగునా ఎన్నెన్నో రంగుల కలలు! ‘‘ఏకాంతంలో మాలినిని సందర్శించి, తనివితీరా ఆమె రూప లావణ్యాలను ఆస్వాదించవలె. తీయతీయని పలుకులతో ఆ సుందరీమణి మనసు దోచి, ఆమెను నొప్పింపక వొప్పించవలె. అటు సూర్యుడు యిటు పొడిచిననూ నేటి రాత్రితో నేను సంపూర్ణ జీవిత సాఫల్యమును పొందవలె’’ అని వువ్విళ్లూరుతున్న కీచకునికి సైరంథ్రి సుధేష్ణ సౌధంలో నిమగ్నమై కనిపించింది. క్షణమైనా ఆగక, కీచకుడు ఆమెతో సరస సంభాషణకు దిగాడు. ఆమె వుదాసీన వైఖరిని అలుసుగా తీసుకుని మరింత వుత్సాహంగా మాటలు దొర్లిస్తున్నాడు. మరొక అడుగు ముందుకు వేసి రకరకాల శృంగార చేష్టలు ప్రారంభించాడు. కాలం దాపురించిన సింహబలుని చేష్టలను రోషావేశాలను అణచుకుని పాంచాలి సహిస్తోంది.

Comments