వూహరచన :
ద్రౌపది తనకు జరిగిన పరాభవానికి దుఃఖిస్తూ, తలదించుకుని అక్కడ నుంచి కదిలింది. సుధేష్ణాదేవి మందిరానికి వెళ్లింది. రాణి మహా గడుసరి. ఏమీ తెలియనట్టే ‘‘మాలినీ, ఏమైంది? ముఖం అట్లా వుందేమిటి? జుత్తు రేగిందెందుకు? దుస్తులనిండా మట్టిమరకలు పడ్డాయే’’ అని అడిగింది. పాంచాలి లోకజ్ఞత తెలీని మూర్ఖురాలు కాదు. ‘‘ఆహా, ఎంతటి నంగనాచి! గొప్పవారికి యెట్లా మాట్లాడినా చెల్లిపోతుంది కాబోలు’’ అని నిట్టూర్చింది. పైగా సుధేష్ణ, సింహబలుల జన్మవృత్తాంతాలు ఆమెకు తెలియనివి కావు. కీచకుని తండ్రి సూతదేశాధీశుడు. మాళవ రాజ్య కన్య మాళవి వలన సూతాధీశునికి నూట ఆరుగురు పుత్రులు కలిగారు. పెద్దకొడుకు కీచకుడు. మిగిలిన నూట అయిదుగురు ఉపకీచకులుగా సోదరునికి నీడలా వుంటారు. మాళవి చెల్లెలి కుమార్తె సుధేష్ణ విరాటరాజు పట్టమహిషి. కండబలం గుండెబలం వున్న కీచకునికి సింహబలుడు అన్వర్థ నామధేయంగా ప్రచారంలోకి వచ్చింది. విరటునికి అండదండలుగా, కీచకుడు తన సహోదరులు ఉపకీచకులతో సహా మత్స్యదేశంలోనే స్థిరపడ్డాడు. రాజుకి సింహబలుడంటే వాత్సల్యంతోబాటు భయం కూడా. అందుకే అతను ఆడింది ఆట, పాడింది పాట. అందుకే తను సైరంథ్రి వృత్తిలో చేరేటపడు విధించిన ఆంక్షలను తోసిరాజని కీచకుని మందిరానికి సుధేష్ణాదేవి పంపింది. ఇపడు ఏమీ తెలియనట్టు యోగక్షేమాలు అడుగుతోంది. రాజ్యాధికారం చేతులో వుంటే ఏది చేసినా చెల్లుతుంది కదా- అని గాఢంగా నిట్టూర్చింది పాంచాలి.తన నివాసానికి వెళ్లి, విధిని నిందిస్తూ ద్రౌపది జరగవలసిన దానిని గురించి ఆలోచించసాగింది. ‘‘సింహబలుని పీచమణచగల సమర్థుడు భీముడు వొక్కడే’’ అని తీర్మానించుకుంది. కంటిపైకి కునుకు రావడం లేదు. గుండె రగులుతోంది. కోట వాకిట నుంచి వినిపిస్తున్న గంటలు అర్ధరాత్రిని సూచిస్తున్నాయి.
అంతఃపురం గాఢనిద్రలో జోగుతోంది. చీకటి, నిశ్శబ్దం పెనవేసుకుపోయి వున్నాయి. ద్రౌపది వొక్కసారి తుళ్లిపడి లేచింది. స్నానం చేసి, మంచి వస్త్రాలు అలంకరించుకుని పాకశాల వైపు నడిచింది. వంటపాత్రలతో సువిశాల శాల కిటకిటలాడుతోంది. పాకవిశేష శేషాలు కమ్మని వాసనలు వెదజల్లుతున్నాయి. వాటి మధ్యన కొండవలె కటిక నేలపై ఆదమరచి నిద్రిస్తున్న భీమసేనుడు కనిపించాడు. ద్రౌపది భర్తను సమీపించి, ‘‘నాథా! యింత చేసిన ఈ కీచకుడు నిర్భయంగా తన మందిరానికి వెళ్లి, గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నాడు. నువ్వు కటిక నేలపై హాయిగా గురకలు పెడుతున్నావు. కంటికి నిదురరానిది నాకేనన్నమాట. కట్టుకున్న యిల్లాలికి నడివీధిన అంతటి అవమానం జరుగుతుండగా చూశావు కదా. అయినా, యింత సుఖంగా నిద్రిస్తున్నావంటే... అది నీ చేతకానితనం అనుకోవాలా? లేక అగ్రజుని ఆదేశానికి కట్టుబడి వున్నావా? లేక నాపై వైముఖ్యమా?’’ అనగా విని, ‘‘నీ రాకను యెవ్వరూ గమనించలేదు కదా’’ అని ఆత్రుతగా ప్రశ్నించాడు భీమసేనుడు.లేదన్నట్టు తలవూపింది ద్రౌపది. ఆమె కళ్లవెంట అశ్రుధారలు జారుతున్నాయి. వలలుడు ఆమెను దగ్గరగా తీసుకుని వూరడించాడు. తన భర్తల పరాక్రమాన్ని, యీ దుస్థితిని తలచుకుని రోదించింది. భీముని వక్షస్థలం ద్రౌపది కన్నీళ్లతో అభిషిక్తమైంది. సాధ్వీ, ఎంతటివారికైనా కాలం కలిసిరానపడు కష్టాలు తప్పవు. గడచిన కాలంలో ఎందరో నీవంటి మహాసాధ్వులు ఎన్నో హింసలు వోర్చారు. సీత, సుకన్య, దమయంతి, లోపాముద్ర ... యిలా ఎందరో విపత్తులనెదుర్కొని తరువాత సకల సుఖాలు అనుభవించలేదా? పాంచాలీ, మన అజ్ఞాతవాస దీక్ష పూర్తికావడానికి ఎక్కువ రోజులు వ్యవధి లేదు. మన కష్టాలు గట్టెక్కడానికి ఆట్టేరోజులు నిరీక్షించాల్సిన పనిలేదు. కీచకుని సంహరించడం నాకు పెద్దపనికాదు. నువ్వు సింహబలుని కోరికను అంగీకరించినట్టు నటించి, వాడిని మచ్చిక చేసుకో. తదుపరి నర్తనశాలను సంకేత స్థలంగా నిర్ణయించి, నిశిరాత్రివేళ ఒంటరిగా అక్కడికి రమ్మను. అర్ధరాత్రి అక్కడకు వచ్చిన సింహబలుని చీకటిలోనే మట్టుపెట్టి నీ పగను చల్లారుస్తాను. అజ్ఞాతవాసంలో వున్న మనకు యింతకంటె మరొక మార్గం తోచడం లేదు- అంటూ ఆమె కన్నీరు తుడిచాడు. భీముని మాటలకు ఆమె ముఖం విప్పారింది. ‘‘మన పథకాన్ని అత్యంత జాగరూకతలో నడిపించాలి. అదుగో, తెలవారడానికి ఆట్టే పొద్దులేదు. నువ్వింక బయలుదేరి వెళ్లు’’ అంటూ మాలినిని కొంతదూరం సాగనంపాడు వలలుడు.

Comments
Post a Comment